Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 19, 2013

దానియేలు1వఅధ్యాయము

1  యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని ముట్టడివేయగా 
2  ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను. 
3  రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెనుఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి, 
4  తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. 
5  మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానముచేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. 
6  యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి. 
7  నపుంస కుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హన న్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజ ర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను. 
8  రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడు కొనగా 
9  దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను 
10  మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడ నేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. 
11  నపుంసకుల యధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారిమీద నియమించిన నియామ కునితో దానియేలు ఇట్లనెను. 
12  భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము. 
13  పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయెడల జరిగింపుము. 
14  అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినములవరకు వారిని పరీక్షించెను. 
15  పది దినములైన పిమ్మట వారి ముఖ ములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటె సౌందర్యముగాను కళగాను కనబడగా 
16  రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యాదుల నిచ్చెను. 
17  ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు వివే చనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను. 
18  నెబుకద్నెజరు తన సముఖ మునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. 
19  రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవ రును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. 
20  రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధ మైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను. 
21  ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమువరకు జీవించెను. 

దానియేలు2వఅధ్యాయము

1  నెబుకద్నెజరు తన యేలుబడియందు రెండవ సంవత్సర మున కలలు కనెను. అందునుగురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను. 
2  కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీవిద్యగలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువ నంపుడని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖ మున నిలచిరి. 
3  రాజు వారితో నేనొక కల కంటిని, ఆ కల భావము తెలిసికొనవలె నని నేను మనోవ్యాకుల మొంది యున్నాననగా 
4  కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరిరాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము. 
5  రాజునేను దాని మరచి పోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు తుత్తునియ లుగా చేయబడుదురు; మీ యిండ్లు పెంటకుప్పగా చేయ బడును. 
6  కలను దాని భావమును తెలియజేసినయెడల దానములును బహుమానములును మహా ఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు 
7  రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పినయెడల మేము దాని భావమును 
8  తెలియజేసెదమని మరల ప్రత్యుత్తరమిచ్చిరి. ఒ అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరచి యుండుట మీరు చూచి కాలహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. 
9  కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధ మును మోసపుమాటలను నాయెదుట పలుక నుద్దేశించి యున్నారు. మీరు కలను చెప్పలేకపోయిన యెడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలిసికొందును. 
10  అందుకు కల్దీయులు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చిరిభూమిమీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునగానియొద్దను గారడీవిద్య గలవానియొద్దను కల్దీయునియొద్దను ఇట్టి సంగతి విచారింప లేదు. 
11  రాజు విచారించిన సంగతి బహు అసాధారణ మైనది, దేవతలుకాక మరెవరును ఈ సంగతి తెలియజెప్ప జాలరు; దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవుగదా. 
12  అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గల వాడై బబులోనులోని జ్ఞానులనందరిని సంహరింపవలెనని యాజ్ఞ ఇచ్చెను. 
13  ఇట్టి శాసనము బయలుదేరుటవలన జ్ఞానులు చంపబడవలసియుండగా, వారు దానియేలును ఆతని స్నేహి తులను చంపజూచిరి. 
14  అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహసంరక్షకుల యధిపతియగు అర్యోకుదగ్గరకు పోయి, జ్ఞానయుక్తముగా మనవిచేసెను 
15  రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజుయొక్క అధిపతియైన అర్యోకు నడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. 
16  అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతి మాలెను. 
17  అప్పుడు దానియేలు తన యింటికి పోయి తన స్నేహితు లైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి 
18  తానును తన స్నేహితులును బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడ నశింపకుండునట్లు ఆ కలయొక్క మర్మవిషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. 
19  అంతట రాత్రియందు దర్శనముచేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దాని యేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. 
20  ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక. 
21  ఆయన కాలములను సమయ ములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు. 
22  ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది. 
23  మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకనుగ్రహించి యున్నావు; మేమడిగిన యీ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసియున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను; ఏలయనగా రాజుయొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరల చెప్పెను. 
24  ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప జేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్లిబబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసెదననెను. 
25  కావున అర్యోకురాజునకు భావము తెలియజెప్పగల యొక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కను గొంటినని రాజుసముఖమున మనవిచేసి, దానియేలును త్వరగా రాజుసన్నిధికి తోడుకొనిపోయెను. 
26  రాజునేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా? అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా 
27  దానియేలు రాజుసముఖములో ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెనురాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకున గాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. 
28  అయితే మర్మములను బయలుపరచ గల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరు నకు తెలియజేసెను. తాము పడకమీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్నదర్శనములు ఏవనగా 
29  రాజా, ప్రస్తుతకాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడకమీద పరుండి మనో చింతగలవారై యుండగా మర్మములను బయలు పరచువాడు కలుగబోవుదానిని తమరికి తెలియజేసెను. 
30  ఇతర మనుష్యులకందరికంటె నాకు విశేష జ్ఞానముండుటవలన ఈ మర్మము నాకు బయలుపరచ బడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును, తమరి మనస్సుయొక్క ఆలోచనలు తాము తెలిసికొను నిమిత్తమును అది బయలుపరచబడెను. 
31  రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమకన బడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహా ప్రకాశమును, భయంకరమునైన రూపమును గలదై తమరియెదుట నిలిచెను. 
32  ఆ ప్రతిమయొక్క శిరస్సు మేలిమి బంగారుమయ మైనదియు, దాని రొమ్మును భుజములును వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, 
33  దాని మోకాళ్లు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను. 
34  మరియు చేతిసహా యము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదములమీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కన బడెను. 
35  అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను. 
36  తాము కనిన కలయిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము. 
37  రాజా, పరలోక మందున్న దేవుడు రాజ్య మును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్ర హించి యున్నాడు; తమరు రాజులకు రాజైయున్నారు. 
38  ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును, మను ష్యులనేమి భూజంతువులనేమి ఆకాశపక్షులనేమి అన్ని టిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు, వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించి యున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు 
39  తాము చనిపోయిన తరు వాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటుతరువాత లోకమంత యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడి వంటిదగును. 
40  పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైనవాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును. 
41  పాద ములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపది గానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్య ములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును. 
42  పాదముల వ్రేళ్లు కొంతమట్టు నకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయ ములో నీరసముగాను ఉండును. 
43  ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకయుందురు. 
44  ఆ రాజుల కాల ములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిం చును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును. 
45  చేతి సహాయము లేక పర్వతమునుండి తియ్యబడిన ఆ రాయి యినుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే; యిందువలన మహా దేవుడు ముందు జరుగ బోవు సంగతి రాజునకు తెలియజేసియున్నాడు; కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. 
46  అంతట రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్ఠాంగనమస్కారము చేసి అతని పూజించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. 
47  మరియు రాజుఈ మర్మమును బయలు పరచుటకు నీవు సమర్థుడవైతివే; నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై యున్నాడని దానియేలునకు ప్రత్యుత్తర మిచ్చెను. 
48  అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, అనేక గొప్ప దానములిచ్చి, అతనిని బబు లోను సంస్థానమంతటిమీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. 
49  అంతట దానియేలు రాజునొద్ద మనవి చేసికొనగా రాజు షద్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను; అయితే దాని యేలు రాజుసన్నిధిని ఉండెను. 

దానియేలు3వఅధ్యాయము

1  రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమయొకటి చేయించి, బబులోనుదేశములోని దూరాయను మైదాన ములో దాని నిలువబెట్టించెను. అది అరువదిమూరల ఎత్తును ఆరుమూరల వెడల్పునై యుండెను. 
2  రాజగు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధి పతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధి క్యము వహించినవారినందరిని సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయొక్క ప్రతిష్ఠకు రప్పించుటకును దూతలను పంపించగా 
3  ఆ యధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును మంత్రులును ఖజానాదారులును ధర్మశాస్త్రవిధాయకులును న్యాయాధి పతులును సంస్థానములలో ఆధిక్యము వహించినవారంద రును రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు కూడివచ్చి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమయెదుట నిలుచుండిరి. 
4  ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగాజనులారా, దేశస్థు లారా, ఆ యా భాషలు మాటలాడు వారలారా, మీకాజ్ఞ ఇచ్చుచున్నాను. 
5  ఏమనగా, బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ సుంఫోనీయ వీణ విపంచిక సకలవిధములగు వాద్య ధ్వనులు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమయెదుట సాగిలపడి నమస్కరించుడి. 
6  సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయ బడును. 
7  సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్దవీణ వీణ సుంఫోనీయ విపంచిక సకలవిధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులును దేశస్థులును ఆ యా భాషలు మాటలాడువారును సాగిలపడి, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. 
8  ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములుచెప్పి 
9  రాజగు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవిచేసిరి రాజు చిరకాలము జీవించును గాక. 
10  రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి; ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను విపంచికను సుంఫోనీయను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. 
11  సాగిలపడి నమస్కరింపనివాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును. 
12  రాజా, తాము షద్రకు, మేషాకు, అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్య ములు విచారించుటకు నియమించితిరి; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజిం చుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. 
13  అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషా కును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజసన్నిధికి తీసికొని వచ్చిరి. 
14  అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెనుషద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా? 
15  బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణను వీణను సుంఫోనీయను విపంచికను సకలవిధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినయెడల సరే మీరు నమస్కరింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు? 
16  షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరినెబుకద్నెజరూ, యిందునుగురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు. 
17  మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను 
18  రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టిం చిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. 
19  అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను. 
20  మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించిషద్రకును, మేషా కును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా 
21  వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండమునడుమ పడవేసిరి. 
22  రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందు నను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి. 
23  షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మను ష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా 
24  రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచిమేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితిమిగదా యని తన మంత్రుల నడి గెను. వారురాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మిచ్చిరి. 
25  అందుకు రాజునేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. 
26  అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చిషద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకు లారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయ టికి వచ్చిరి. 
27  అధిపతులును సేనాధిపతులును సంస్థానాధి పతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒక టైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపో కుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. 
28  నెబుకద్నెజరుషద్రకు, మేషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు; ఆయన తన దూతనంపి తన్నా శ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థ పరచిరి. 
29  కాగా నేనొక శాసనము నియమించుచున్నాను; ఏదనగా, ఇవి్వధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను. 
30  అంతట నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. 

దానియేలు4వఅధ్యాయము

1  రాజగు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆ యా భాషలు మాటలాడు వారికిని ఈలాగు సెలవిచ్చుచున్నాడుమీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక. 
2  మహోన్నతుడగు దేవుడు నా యెడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. 
3  ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి; ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము; ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. 
4  నెబుకద్నెజరను నేను నా యింట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనైయుండి యొక కల కంటిని; అది నాకు భయము కలుగజేసెను. 
5  నేను నా పడకమీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలం పులు నన్ను కలతపెట్టెను. 
6  కావున ఆ స్వప్నభావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులనందరిని నా యెదుటికి పిలువనంపవలెనని ఆజ్ఞ నేనిచ్చితిని. 
7  శకున గాండ్రును గారడీవిద్యగలవారును కల్దీయులును జ్యోతి ష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేక పోయిరి. 
8  కడపట బెల్తెషాజరను నా దేవత పేరునుబట్టి బిరుదుపొందిన దానియేలను వాడు నా యెదుటికి వచ్చెను; పరిశుద్ధ దేవతల ఆత్మ అతనియందుండెను, కావున నేనతనికి నా కలను చెప్పితిని. 
9  ఎట్లనగాశకునగాండ్ర అధిపతి యగు బెల్తెషాజరూ, పరిశుద్ధదేవతల ఆత్మ నీయందున్న దనియు, ఏ మర్మము నిన్ను కలతపెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియ జెప్పుము. 
10  నేను నా పడకమీద పరుండియుండగా నాకు ఈ దర్శనములు కలిగెను; నేను చూడగా భూమిమధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను. 
11  ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకా శమునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. 
12  దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకో ట్లకు చాలునంత ఆహారముండెను; దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను; సకల మనుష్యులకు చాలునంత ఆహారము దానియందుండెను. 
13  మరియు నేను నా పడక మీద పండుకొనియుండి నా మనస్సునకు కలిగిన దర్శనము లను చూచుచుండగా, 
14  జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశమునుండి దిగి వచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి; పశువులను దాని నీడనుండి తోలివేయుడి; పక్షులను దాని కొమ్మలనుండి ఎగురగొట్టుడి. 
15  అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించునట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి, పొలములోని గడ్డిపాలగు నట్లు దానిని భూమిలో విడువుడి. 
16  ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. 
17  ఈ ఆజ్ఞ జాగరూకు లగు దేవదూతల ప్రకటన ననుసరించి జరుగును, నిర్ణయ మైన పరిశుద్ధుల ప్రకటన ననుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారియైయుండి, తానెవరికి అనుగ్రహింప నిచ్ఛ éయించునో వారికనుగ్రహించుననియు, ఆ యా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నా డనియు మనుష్యులందరు తెలిసికొనునట్లు ఈలాగు జరు గును. 
18  బెల్తెషాజరూ, నెబుకద్నెజరను నాకు కలిగిన దర్శ నము ఇదే; నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్ప నేరడు. నీయందు పరిశుద్ధ దేవ తల ఆత్మయున్నది గనుక నీవేదానిని చెప్ప సమర్థుడ వంటిని. 
19  అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునొంది మనస్సునందు కలవరపడగా, రాజు బెల్తెషాజరూ, యీ దర్శనమువలన గాని దాని భావము వలన గాని నీవు కలవరపడకుము అనెను. అంతట బెల్తె షాజరునా యేలినవాడా, యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక, 
20  తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయెను; దాని పైకొమ్మలు ఆకాశ మునకంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. 
21  దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను, దాని నీడను అడవిజంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెనుగదా 
22  రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడ వైతివి; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తా యెను; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది. 
23  చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము; ఇనుము ఇత్తిడి కలి సిన కట్టుతో ఏడు కాలములు గడచువరకు పొలములోని పచ్చికలో దాని కట్టించి, ఆకాశపుమంచుకు తడవనిచ్చి పశువులతో పాలుపొందనిమ్మని జాగరూకుడగు ఒక పరి శుద్ధుడు పరలోకమునుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి గదా. 
24  రాజా, యీ దర్శనభావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా యేలినవానిగూర్చి చేసిన తీర్మానమేదనగా 
25  తమయొద్ద నుండకుండ మను ష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి తినెదవు; ఆకాశపు మంచు నీమీదపడి నిన్ను తడుపును; సర్వోన్నతుడగుదేవుడు మానవుల రాజ్యముపైన అధికారియై యున్నాడ నియు, తానెవనికి దాని ననుగ్రహింప నిచ్ఛయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలిసికొనువరకు ఏడు కాల ములు నీకీలాగు జరుగును. 
26  చెట్టుయొక్క మొద్దునుండ నియ్యుడని వారు చెప్పిరిగదా దానివలన1 సర్వోన్నతుడు అధికారియని నీవు తెలిసికొనిన మీదట నీ రాజ్యము నీకు మరల ఖాయముగ వచ్చునని తెలిసికొమ్ము. 
27  రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను. 
28  పైన జెప్పినదంతయు రాజగు నెబుకద్నెజరు నకు సంభవించెను. 
29  పండ్రెండు నెలలు గడచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా 
30  రాజుబబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను. 
31  రాజు నోట ఈ మాట యుండగా ఆకాశమునుండి యొక శబ్దము వచ్చెను, ఏదనగారాజగు నెబుకద్నెజరూ, యిదే నీకు ప్రకటన నీ రాజ్యము నీయొద్దనుండి తొలగిపోయెను. 
32  తమయొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు; నీవు అడవిజంతువుల మధ్య నివాసము చేయుచు పశువులవలె గడ్డి మేసెదవు; సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి యైయుండి, తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయిం చునో వానికి అనుగ్రహించునని నీవు తెలిసికొనువరకు ఏడు కాలములు నీకీలాగు జరుగునని చెప్పెను. 
33  ఆ గడియలోనే ఆలాగున నెబుకద్నెజరునకు సంభ వించెను; మానవులలోనుండి అతని తరిమిరి, అతడు పశువులవలె గడ్డిమేసెను, ఆకాశపుమంచు అతని దేహ మును తడపగా అతని తలవెండ్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెలవంటివియు అతని గోళ్లు పక్షుల గోళ్లవంటివియు నాయెను. 
34  ఆ కాలము గడచిన పిమ్మట నెబుకద్నె జరను నేను మరల మానవబుద్ధిగలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రముచేసి ఘనపరచి స్తుతించితిని; ఆయన ఆధిపత్యము చిరకాలమువరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. 
35  భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు. 
36  ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను; నా మంత్రు లును నా క్రిందియధిపతులును నాయొద్ద ఆలోచన చేయ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. 
37  ఈలాగు నెబు కద్నెజరను నేను పరలోకపు రాజుయొక్క కార్యములన్నియు సత్య ములును, ఆయన మార్గములు న్యాయములునై యున్న వనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తు డనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘన పరచుచు నున్నాను. 

దానియేలు5వఅధ్యాయము

1  రాజగు బెల్షస్సరు తన యధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందుచేయించి, ఆ వెయ్యిమందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను. 
2  బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. 
3  అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయ ములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణు లును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. 
4  వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా 
5  ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్న ట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా 
6  అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను. 
7  రాజు గారడీ విద్యగల వారిని కల్దీయులను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెనుఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును. 
8  రాజు నియమించిన జ్ఞానులందరు అతని సముఖము నకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుట యైనను వారివల్ల కాకపోయెను. 
9  అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన యధి పతులు విస్మయమొందునట్లుగా ముఖవికారముగలవాడా యెను. 
10  రాజునకును అతని యధిపతులకును జరిగిన సంగతి రాణి తెలిసికొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెనురాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండ నిమ్ము. 
11  నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు; నీ తండ్రికాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకున గాండ్రకును గారడీవిద్యగల వారికిని కల్దీయులకును జ్యోతిష్యులకును పై యధిపతిగా అతని నియమించెను. 
12  ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తర మిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. 
13  అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెనురాజగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసికొనివచ్చిన చెర సంబంధమగు యూదు లలోనుండు దానియేలు నీవే గదా? 
14  దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీయందున్నవని నిన్నుగూర్చి వింటిని. 
15  ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీవిద్యగల వారిని పిలి పించితిని గాని వారు ఈ సంగతియొక్క భావమును తెలుపలేక పోయిరి. 
16  అంతర్భావములను బయలుపరచుట కును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్ధుడవని నిన్నుగూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుట కును నీకు శక్యమైనయెడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణకంఠభూషణము ధరించుకొని రాజ్యములో మూడవ యధిపతివిగా ఏలుదువు. 
17  అందుకు దానియేలు ఇట్లనెనునీ దానములు నీయొద్ద నుంచు కొనుము, నీ బహుమానములు మరి ఎవనికైన నిమ్ము; అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియ జెప్పెదను. 
18  రాజా చిత్తగించుము; మహోన్నతు డగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘన తను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. 
19  దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను; ఎవరిని పడ వేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములును జనులును ఆ యా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి. 
20  అయితే అతడు మనస్సున అతిశయించి, బలా త్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను. 
21  అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశు వులవంటి మనస్సుగలవాడా యెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్య ములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించు నని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను. 
22  బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమం దున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. 
23  ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉప పత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచు కొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించి తిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. 
24  కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్‌ ఉఫార్సీన్‌. 
25  ఈ వాక్యభావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను. 
26  టెకేల్‌ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. 
27  ఫెరేన్‌ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. 
28  బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని 
29  మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వము చేయు టలో నతడు మూడవ యధికారియని చాటించిరి. 
30  ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను. 
31  మాదీయుడగు దర్యావేషు అరువది రెండు సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను. 

దానియేలు6వఅధ్యాయము

1  తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువదిమంది యధిపతులను నియమించుటకు దర్యా వేషునకు ఇష్టమాయెను. 
2  వారిపైన ముగ్గురిని ప్రధానులగా నియమించెను; ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ యధిపతులు తప్ప కుండ వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. 
3  ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానుల లోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దే శించెను. 
4  అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయి నను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి. 
5  అందుకా మను ష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి. 
6  కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరిరాజగు దర్యా వేషూ, చిరంజీవివై యుందువుగాక. 
7  రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధి పతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, nయీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి 
8  మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి నను సరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవిచేసిరి. 
9  కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. 
10  ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను. 
11  ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థనచేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి 
12  రాజు సముఖమునకు వచ్చి శాసనవిషయమును బట్టిరాజా, ముప్పది దినములవరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయ కూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? అని మనవి చేయగా రాజుమాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిప్రకారము ఆ సంగతి స్థిరము; ఎవరును దాని రద్దుపరచజాలరనెను. 
13  అందుకు వారుచెరపట్ట బడిన యూదులలోనున్న ఆ దానియేలు, నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు ప్రార్థనచేయుచు వచ్చుచున్నాడనిరి. 
14  రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢముచేసికొని, సూర్యు డస్తమించువరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. 
15  ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సంద డిగా కూడి వచ్చిరాజా, రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసి కొనవలెననిరి. 
16  అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌ తులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజునీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. 
17  వారు ఒక రాయి తీసికొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియు దానియేలును గూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమోయని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి. 
18  అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగ నియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను. 
19  తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గుహదగ్గరకు త్వరపడిపోయెను. 
20  అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచిజీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను. 
21  అందుకు దానియేలురాజు చిరకాలము జీవించునుగాక. 
22  నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను. 
23  రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌ తులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగ లేదు. 
24  రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుమీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొనివచ్చి సింహ ముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను. 
25  అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకలజనులకును రాష్ట్రములకును ఆ యా భాషలు మాట లాడువారికిని ఈలాగు వ్రాయించెను మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక. 
26  నా సముఖమున నియమించిన దేమనగానా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలుయొక్క దేవునికి భయ పడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును. 
27  ఆయన విడిపించువాడును రక్షించు వాడునైయుండి, పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. 
28  ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వకాల మందును వర్థిల్లెను. 

దానియేలు7వఅధ్యాయము

1  బబులోను రాజగు బెల్షస్సరుయొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను; అతడు తన పడకమీద పరుండి యొక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. 
2  దానియేలు వివరించి చెప్పినదేమనగారాత్రియందు దర్శనములు కలిగి నప్పుడు నేను తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రముమీద గాలి విసరుట నాకు కనబడెను. 
3  అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములోనుండి పై కెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై యుండెను. 
4  మొదటిది సింహ మును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టు కొని నేలపైన నిలువబడెను. మరియు మానవమనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను. 
5  రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్లమధ్య మూడు ప్రక్కటెము కలను పట్టుకొనినది. కొందరులెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. 
6  అటు పిమ్మట చిరుతపులినిపోలిన మరియొక జంతువును చూచితిని. దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను; దానికి నాలుగు తలలుండెను; దానికి ఆధిపత్య మియ్య బడెను. 
7  పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా, ఘోరమును భయం కరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను. 
8  నేను ఈ కొమ్ము లను కనిపెట్టగా ఒక చిన్న కొమ్మువాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను. 
9  ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహా సనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను. 
10  అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను. 
11  అప్పుడు నేను చూచుచుండగా, ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. 
12  మిగిలిన ఆ జంతు వుల ప్రభుత్వము తొలగిపోయెను; సమయము వచ్చువరకు అవి సజీవులమధ్యను ఉండవలెనని యొక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయెను. 
13  రాత్రి కలిగిన దర్శన ములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధు డగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. 
14  సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయ బడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు. 
15  నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నం దున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. 
16  నేను దగ్గర నిలిచియున్న వారిలో ఒకని యొద్దకుపోయిఇందునుగూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా, అతడు నాతో మాటలాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేసెను. 
17  ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి. 
18  అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు; వారు యుగయుగములు యుగయుగాంత ములవరకు రాజ్యమేలుదురు. 
19  ఇనుపదంతములును ఇత్తిడి గోళ్లును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలిసికొనగోరితిని; అది యెన్నటికి భిన్నమును మిగుల భయంకరమునై, సమస్తమును పగులగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను. 
20  మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు, వాటి మధ్యనుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి, కన్ను లును గర్వముగా మాటలాడు నోరునుగల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ములకంటె బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని. 
21  ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున దాయెను. 
22  ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరి శుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని. 
23  నేనడగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెనుఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును. 
24  ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును. 
25  ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాల ములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు. 
26  అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలముచేయుటకునుతీర్పు విధింపబడెను గనుక అది కొట్టి వేయబడును. 
27  ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరి శుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను. 
28  దాని యేలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడ నైతిని; అందుచేత నా ముఖము వికారమాయెను; అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని.